Thursday, August 9, 2007

తెలివి....

' తెలివి ' దీని గురించి ఎంత మంది ఎన్ని చెప్పినా నేను చిన్నప్పుడు విన్న ఒక విషయం మాత్రం నా మనసులో ఉండి పొయింది. అదేమిటంటే " తాడిని తన్నేవాడు ఒకడు ఉంటె వాడి తలని తన్నే వాడు ఒకడు ఉంటాడు " అని.

అలాగే ' తెలివి ' గురుంచి నాకు తెలిసిన ఒక చిన్న కథ.....

రాకేష్ కి చాలా ఉక్రోషంగా ఉంది. తాతాయ్య మీద, చిన్ని గాడి మీద చాలా కోపంగా ఉంది.
"ఛ..తాతాయ్య ఎప్పుడూ అంతే...చిన్ని గాడి ముందు ఎప్పుడూ నన్ను తక్కువ చేసి మాట్లాడతాడు" పదే పదే తనలో తనే అనుకొంటున్నాడు. ఈ రోజే కాదు తనకి ఊహ వచ్చినప్పటి నుండి చుస్తున్నా ఇదే వరుస. ఇవాళ ఏమైనా తాతాయ్యని అడిగేయ్యాలిసిందే అని నిశ్చయించుకొని తిన్నగా తాతాయ్య దగ్గరికి వెల్లి నిలబడ్డాడు.
దిన పత్రిక చదువుకొంటున్న తాతగారు మనవడిని చూసి ఏమిటని కనుబొమ్మలు ఎగరేసారు.
"తాతాయ్యా నువ్వెప్పుడూ చిన్నిగాడినే మెచ్చుకంటావ్. ఏ నేను తెలివైన వాడిని కాదా. నేను వాడి కన్నా రెండు సంవత్సరాలు పెద్ద తెలుసా" ముక్కు ఎగ పేలుస్తూ చెపుతున్న పది సంవత్సరాల మనమడిని మురెపంగా చూస్తున్న భూషయ్య గారి మీసాలు వెనుక చిరు దరహసం వెలిసింది.
" ఒరేయ్ రాకేష్ అమ్మనడిగి ఒక ఖాళీ సీసా పట్టుకురా" .తూనీగ లాగ లోపలికి పరిగెట్టిన రాకేష్ సేసాతో వచ్చాడు."ఇప్పుడు బయటకి వెళ్ళి కొంచం ఇసుక,చిన చిన రాళ్ళు కొన్ని,కొంచం పెద్ద రాళ్ళు కొన్ని పట్టుకొనిరా" అని మళ్ళీ పురమాయించారు ఆయన. భూషయ్య గారు చెప్పినివి అన్నీ తీసుకొచ్చిన రాకేష్, వీటితో తాతాయ్య తన తెలివిని ఎలా పరీక్షిస్తారో అని ఉత్సాహంగా భూషయ్య గారు చేసె కార్యక్రమాన్ని కళ్ళు పెద్దవి చెసుకుని గమనించసాగాడు.
భూషయ్య గారు గాజు సీసాను,ఇసుకను,చిన్న,పెద్ద రాళ్ళను వరుసగా పేర్చి రాకేష్ వేపు చూసారు.
"ఒరేయ్ రాకేష్ ఈ ఇసుకను, రాళ్ళని ఈ గాజు సేసాలో పోయాలి. కాని నీకు ఒక అవకాశం మత్రమే. అంటే ఒకసారి ఒకటి పోసి కాదని దాన్ని కింద పోసి మళ్ళి ఇంకొకటి పోయగూడదు. అర్థమైందా. బాగా ఆలోచించి మొదలుపెట్టు." రెండు నిముషాలు మౌనంగా వాటిని చూస్తూ ఆలోచించిన రాకేష్, సీసాని తీసుకొని మొదట ఇసుకని పోసాడు, తర్వాత చిన్న రాళ్ళను వేసాడు. అప్పటికే సీసా మూడు వంతులు నిండి పోయింది.పెద్ద రాళ్ళు రెండు వేసేటప్పడికి సీసాలో మిగతా ఖాళీ కూడా నిండి పొయింది. బేల ముఖం వేసుకుని కూర్చున్న రాకేష్ భుజం తడుతూ "వెళ్ళి చిన్నిని తీసుకురా...." చెప్పారు భూషయ్యగారు.
చిన్ని,రాకేష్ వచ్చేసరికి సీసాలో ఉన్నవాటినన్నిటిని వేరు చెసేసారు భూషయ్యగారు. రాకేష్ కి చెప్పినట్టే చిన్ని కి కూడ చెప్పి "చెయ్యగలవా.." అని అడిగారు.
తలూపుతూ రెండు నిముషాలు మౌనంగా వాటిని చూసాడు. మొదటగా పెద్ద రాళ్ళను తీసుకొని సీసాలో వేసాడు. తర్వాత చిన్న రాళ్ళను తీసుకొని ఒక్కొ రాయిని వేస్తూ అవి పెద్ద రాళ్ళ మధ్యన ఉన్న ఖాళీల్లోకి వెళ్ళేటట్లు వేసాడు. ఆఖరున ఇసుకను తీసుకొని నెమ్మదిగా, సీసాను కుదుపుతూ పోసాడు. ఇసుకంతా సీసాలో రాళ్ళ మధ్యన ఖాళీలోకి వెళ్ళి సీసా నిండి పోయింది. చిన్ని చేతులు దులుపుకుంటూ భూషయ్యగారిని చూసి నవ్వాడు.
భూషయ్యగారు రాకేష్ ని చూసి నవ్వారు.
తాతయ్య చిన్నిని ఎందుకు మెచ్చుకుంటారో తనకి అర్థమైనట్లు చిరునవ్వుతో అక్కడనుండి వెళ్ళిపోయాడు రాకేష్.


సరదాగ చిన్న కథ లాగానే ఉన్న ఇందులో ఒక జీవిత సత్యం ఉంది.
ఇక్కడ....సీసా ఒక మనిషి జీవిత కాలాన్ని సూచిస్తుంది. ఇసుక,చిన్న రాళ్ళు,పెద్ద రాళ్ళు మనం నిర్దేసించుకోవల్సిన,చేరవల్సిన గమ్యాలుని, లక్ష్యాలుని సూచిస్తున్నాయి.
ప్రతిఒక్కరూ పెద్ద పెద్ద లక్ష్యాలుని గమ్యాలని నిర్దేసించుకొని వాటి లక్ష్య సాధనకై కృషి చేస్తే చిన్న విజయాలు వాటంతటవే వరిస్తాయ్.

1 comment:

శ్రీనివాసు యలమాటి said...

ఈ కథ చాలా బావుంది.