Wednesday, March 10, 2010

ఉజ్జయిని మరియు ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ యాత్ర....

             ఉజ్జయిని అందరూ చుడతగ్గ శైవపుణ్యక్షేత్రం. మొత్తం 12 జ్యోతిర్లింగాలులో రెండు జ్యోతిర్లింగాలు మధ్యప్రదేశ్ లోనే ఉన్నాయి, ఒక జ్యోతిర్లింగం ఉజ్జయనిలో మహాకాళేశ్వర్ గాను  మరొక జ్యోతిర్లింగం ఓంకారేశ్వర్లో ఓంకారేశ్వర్ గాను వెలసాయి.


             ఉజ్జయిని మహాకాళేశ్వర్ కి సుప్రభాత సేవ ప్రాతఃకాలం సుమారు నాలుగు గం|| కి మొదలవుతుంది. ఈ సేవలో అభిషేకానికి స్మశానం నుండి మానవ శరీరాన్ని దహనం చేసిన భస్మాన్ని వినియోగిస్తారు. ప్రతీరోజు ఉదయం ఒక్కసారి మాత్రమే జరిగే ఈ అభిషేకాన్ని చూడడానికి రాత్రి పదకొండు, పన్నెండు గం|| నుండి భక్తులు క్యూలో నిలబడడం మొదలుపెడతారు. క్యూలో ఉన్న మొదటి వంద మందికి మాత్రమే ఈ సేవ దగ్గరినుండి చూసే భాగ్యం దొరుకుతుంది. తర్వాత సుమారు మూడు వందలమందికి ఆలయ ప్రవేశం ఉంటుంది, వీరు మొత్తం రెండు గంటలసేపు జరిగే ఈ అభిషేకాన్ని క్లోజుడ్ సర్కూట్ టి.వి.లలో చూడవచ్చు, మహా హారతి ఇచ్చిన తరవాత వీరికి మహాకాళేశ్వర్ (జ్యోతిర్లింగం) ని దర్శించే అవకాశం దొరుకుతుంది. ఉజ్జయినిలో భక్తులు మహాకాళేశ్వర్ (జ్యోతిర్లింగం)ని తాకి తన్మయానందాన్ని పొందవచ్చు. ఈ నాలుగు వందలమంది దర్శనం తర్వాత రెండవ సారి అభిషేకం, హారతి మొదలవుతాయి, అంటే క్యూలో నిలబడడం ఏమాత్రం ఆలస్యం అయినా రెండవసారి అభిషేకం జరిగి మహా హారతి ఇచ్చేవరకు ఎదురుచూడవలిసి ఉంటుంది. గుడి లోపలికి కెమెరాలు కాని, బాగులు గాని ( ఆడవారి చేతి బాగులు ) తీసుకువెళ్ళకూడదు. ఒకవేళ తీసుకువెళ్ళితే సెక్యూరిటీ వాళ్ళు వెనకకు పంపించివేస్తారు, వెనక్కి వెళ్ళి అవి ఎక్కడన్నా పెట్టి వచ్చాక మళ్ళి లైన్ లో నుంచొనవలిసి వస్తాది. సెక్యూరిటీ దగ్గర లాకర్ సౌకర్యం కూడ ఉండదు వస్తువులు అక్కడ పెట్టి తిరిగి వచ్చి తీసుకోవడానికి.


              మహాకాళేశ్వర్ ఆలయ ప్రాంగణంలో భక్తులు ఆలయ ప్రవేశం కోసం క్యూలో నిలబడడానికి ఐరన్ బారికేడ్స్ ఉన్న ప్రదేశంలో కొన్ని వందల సంవత్సరాల వయస్సుగల మహవృక్షాలు ఐదు, ఆరు ఉన్నాయి, వాటినిండా రకరకాల పక్షులు కొన్ని వేలు ( కాకి, గోరువంక మొ|| ) తమ కిల కిల రావాలతో  మహాకాళేశ్వర్ దర్శనానికి వచ్చిన భక్తులకి స్వాగతం పలుకుతాయి. కాని సుచిగా స్నానాదులు ముగించుకొని, ఉతికిన శుభ్రమైన దుస్తులు దరించి స్వామి దర్శినానికి వచ్చిన భక్తులు మనస్సుని దేవునిపై లగ్నం చేయకుండా మాటి మాటికి తల పైకి ఎత్తి చెట్లు వంక, పక్షులు వంక, తమ దుస్తులు వంక చూసుకొంటూ ఆ పక్షులు ఎక్కడ తమ పై రెట్టలు వేయునోనని  భయపడుతూ "త్వరగా ఆలయ తలుపులు తెరుచుకొంటే బాగుండును తొందరగా లోపలకి వెళ్ళిపొదుం అనుకొంటుంటారు" (నేనూ దీనికి మినహయింపు కాదు, అసలు అందరికన్నా నేనే ఎక్కువుగా పైకి చూసి ఉంటాను).


            మేము భోపాల్ నుండి శనివారం రాత్రి 10 గం|| కి ' టవేర ' లో బయలుదేరి, ఆదివారం ఉదయం రెండు గం|| కి ఉజ్జయిని చేరుకొన్నాం, భోపాల్ నుండి ఉజ్జయిని 200కి.మి. దూరం ఉంటుంది. అక్కడ హొటల్ లో స్నానాదులు ముగించుకొని మూడున్నర గం|| కల్లా ఆలయం బయట దుకాణాలలో అమ్మే పూలు మరియు పాలు తీసుకొని క్యూలో నిలబడితే నాలుగున్నర గం|| కి ఆలయ ప్రవేశం లభించింది. క్లోజుడ్ సర్కూట్ టి.వి. లలో స్వామి వారి అభిషేకాన్ని  తిలకించి, మహా హారతిని టి.వి. లలోనే చూసి కళ్ళకి అద్దుకొని, గర్భగుడి వరకు క్యూలో వెళ్ళి  మహ జ్యొతిర్లింగాన్ని దర్శంచి, కూడా తీసుకువెళ్ళిన పాలతో అభిషేకించి, స్పృశించి, కూడా తీసుకువెళ్ళిన పూలతో పూజించి  "హర హర మహ దేవ శంభో శంకర" అనే భక్తుల గొంతులతో మా గొంతులని శృతి కలిపి హృదయం నిండా మహకళేశ్వర్ ని నింపుకొని బయటకి వచ్చాం. ఇంకా ఆలయ ప్రాంగణంలో ఉన్న గుళ్ళను, నవగ్రహలను దర్శించుకొని ఆలయం వెలుపలకి వెళ్ళి టైం చూస్తే ఏడున్నర గం|| అయింది.

            ఊజ్జయినికి 20కి.మి. దూరంలో కాలభైరవుడి గుడి ఉంది, మేము ఫలహారాలు ముగించుకొని కాలభైరవుడిని దర్శించుకోవడానికి అక్కడికి వెళ్ళాము. కాలభైరవుడికి మరో పేరు కూడ ఉంది అదేమిటంటే మందు స్వామి ( డ్రింకింగ్ గాడ్ ). ప్రతి గుడి ముందర దుకాణాలలో పూలు, పళ్ళు, కొబ్బరికాయలు అమ్ముతారు కాని ఇక్కడ దుకాణాలలో మాత్రం పూలు, ప్రసాదం ( స్వీట్స్ ), మందు అమ్ముతారు. రక రకాల బ్రాండ్ల విస్కీ, బ్రాందీ క్వార్టర్, హఫ్, ఫుల్ లో అమ్ముతారు స్వామికి ఇవ్వడానికి. మేము ఆశ్చర్యంతో తీసుకు వెళ్ళాలా, వద్దా అని తర్జన భర్జనలు పడి చివరకి ఒక క్వార్టర్ విస్కీ, పూలు, ప్రసాదం తీసుకొని దర్శనం కోసం గాలి గోపురం దాటాం. అక్కడ కోతులు భక్తుల మీదపడి ప్రసాదాన్ని లాక్కుపొతున్నాయి. మేము దాన్ని వింతగా చుస్తుండగా ఒక ఆలయ ఉద్యోగి హిందీలో చెపుతున్నాడు ప్రసాదాన్ని జేబులో దాచేయండి అని, పుజా సామాగ్రి అంతా ఒక బుట్టలో పెట్టుకువస్తున్న మా స్నేహితుడికి హిందీ అర్థం కాక చూస్తున్నాడు నేను అతనికి తెలుగు లో చెపుతున్నాను ఇంతలో ఒక కోతి మనవాడి మీదకి దూకడం వాడు భయపడి పూజ సామాగ్రి బుట్ట వదిలేయడం ఆ కోతి ప్రసాదం తీసుకొని వెళ్ళిపొవడం కూడ జరిగిపొయింది. సరిలే అయ్యింది యేదో అయ్యింది అని  దర్శనానికి వెళ్ళాం, అక్కడ పూజారి భక్తులు తెచ్చిన పూలు స్వామి వారికి అలంకరించి, ప్రసాదాన్ని స్వామి వారి పాదాల దగ్గిర ఉంచి, సగం విస్కీని ఒక ప్లేట్లో పోసి స్వామివారి నోటి దగ్గర పెడితే ఆయన అది మొత్తం గుటక వేస్తూ తాగేయడం చూసి భక్తితో నమస్కరించాం. పూజారి కొన్ని పూలు, ప్రసాదం, మిగిలిన సగం విస్కీ భక్తులకి స్వామివారి ప్రసాదం గా ఇస్తున్నాడు. కొంత మంది మిగిలిన విస్కీని కూడా స్వామివారికే ఇచ్చేసి కనులారా స్వామిని దర్శించుకోని తీర్దప్రసాదాలు తీసుకొని వస్తున్నారు. మేము కూడా ఆ విషయాలన్ని చర్చించుకొంటూ తిరిగి ఉజ్జయిని బయలుదేరాం.


            ఉజ్జయినికి 10కి.మి. దూరంలో ' చింతామణి ' అని వినాయకుడి గుడి ఉంది, ఎవరైనా చింతామణి స్వామిని దర్శించుకోని తమ మనసులోని కోరికని (చింతని) స్వామి వారికి విన్నవించి, ఆ చింత దూరం ఐతే మళ్ళీ స్వామి దర్శినం చేసుకొంటాం అని మొక్కుకొంటే ఆ చింత దూరం అవుతాది అని స్థల విశేషం మరియు భక్తుల నమ్మకం కూడ. మేము కూడా చింతామణి స్వామిని దర్శించుకొని  ఓంకారేశ్వర్ బయలుదేరాం.


          ఓంకారేశ్వరుడు నర్మదానదీ తీరాన కొలువైఉన్నాడు. ఉజ్జయిని నుండి ఓంకారేశ్వర్ 190కి.మి దూరం ఉంటుంది. మేము ఓంకరేశ్వర్ చేరుకొనేటప్పడికి మధ్యాహ్నం రెండు గం|| అయ్యింది టైము. ఓంకారేశ్వరుడిని దర్శించుకోవాలి అంటే నర్మదానదిని దాటాలి, నడిచి వెళ్ళడానికి నర్మదానది మీద వంతెన ఉంది లేదా పడవ మీద నదిని దాటి స్వామి దర్శనానికి వెళ్ళవచ్చు. మేము పడవ మీద వెళ్ళడానికి నిశ్చయించుకొని వెళ్ళడానికి, రావడానికి, నదిలో కొంచం సేపు తిరగడానికి మాట్లాడుకొని బయలుదేరాం. పడవ వాడు నదిలో కొంచం సేపు అటు,ఇటు తిప్పి నర్మదానది మీద కట్టిన రిజర్వాయరుని చూపించి అవతల వడ్డుకి చేర్చాడు. పూజాసామాగ్రిని తీసుకొని, మెట్లు ఎక్కి ( గుడి చిన్న కొండ మీద ఉంది ), క్యూలో నిలబడి స్వామి దర్శనం చేసుకొన్నాం. ఓంకారెశ్వరుడిని ( జ్యోతిర్లింగాన్ని ) కూడా భక్తులు స్పృశించవచ్చు. ఇక్కడ గుడిలోకి కెమెరా తీసుకువెళ్ళవచ్చు కాని ఫొటొస్ తీసుకొనే సౌలభ్యం, అవకాశం, టైము ఉండవు. మేము తనివితీరా ఓంకారేశ్వరుడిని దర్శించుకొని, జ్యోతిర్లింగాన్ని తాకి, ప్రసాదాలు తీసుకొని ఆనందంగా బయటకి వచ్చి, ఆలయ ప్రాంగణంలోని మిగతా గుళ్ళని దర్శించుకొని తిరిగి పడవ ఎక్కి ఆవలి వడ్డుకి చేరుకొన్నాం. అక్కడ నుండి బయలుదేరి భొపాల్ కి రాత్రి 10 గం|| కి చేరుకొన్నాం.

           










            ప్రపంచంలో ఏమూలకి, ఏ టైముకి వెళ్ళినా అక్కడ తెలుగు వాళ్ళు ఉంటారు అనేది ఒక నానుడి. మేము ఉజ్జయినిలో దర్శనం కోసం క్యూలో నిలబడినప్పుడు తెలుగు వాళ్ళని చూసాం, తిరిగి ఓంకారేశ్వర్లో అమ్మా వాళ్ళు అంతా షాపులో ఏవో కొంటుంటే అక్కడ తెలుగు వాళ్ళు కలిసారు తూర్పు గోదావరి నుండి వచ్చారు అంట. వారికి సరైన గైడెన్స్  లేక స్థల విశేషం తెలియక ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ని ఉదయం పూట దర్శించుకొలేకపొయారు. మనకి తెలిసిన విశేషాలిని ఇక్కడ ఉంచితే ఎవరికైనా ఉపయోగపడుతుంది అని ఇలా..............

          భోపాల్ నుండి ఉజ్జయిని వెళ్ళడానికి ప్రతీ రోజూ రాత్రి 11 గం|| కి ఒక ట్రైన్ ఉంది, అది ఉజ్జయని ఉదయం 3గం|| కి చేరుస్తుంది, స్నానాదులు ముగించుకొని ఉదయం పూట దర్శనానికి క్యూలో నిలబడవచ్చు. ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చేవాళ్ళు అయితే రాత్రి 11 గం|| కి  భోపాల్ మైన్ స్టేషన్ కి వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవచ్చు. అక్కడ దర్శనం అయిన తరవాత మిగతా ప్రదేశాలు తిరగడానికి బస్ సౌకర్యం ఉంటుంది. మొత్తం రెండు రోజులు పడుతుంది ప్లాన్ చేసుకొంటె.

1 comment:

కొండముది సాయికిరణ్ కుమార్ said...

భస్మహారతికి, ఇప్పుడు ఒక రోజు ముందుగా అప్లికేషన్ పెట్టుకోవాలండి, పొద్దున అప్లికేషన్ ఇచ్చాక, సాయంత్రానికి ఫలితాలు ప్రకటిస్తారు. అదృష్టం ఉంటే, అవకాశం దొరుకుతుంది. లేదంటే, మర్నాడు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలి.
* * *
అసలు అమ్మవారి గురించి చెప్పలేదేంటి ఉజ్జయినిలో! గఢ్ కాళి అని కాలభైరవుడి గుడికి కొద్దిగా దగ్గరలోనే ఉంది. అక్కడే, అమ్మవారి కృపకు పాత్రుడై, కాళిదాసు మహాకవి అయ్యింది.