Saturday, March 13, 2010

ఎవరి మాట వినాలి.....

             నేను ఎప్పుడు మా ఊరు వెళ్ళినా ఎవరో ఒకరు వాళ్ళ పిల్లలని కాని, వాళ్ళ చుట్టాల పిల్లలని కాని తీసుకువచ్చి 10వ తరగతి అయిపొయింది లేదా ఇంటర్మీడియట్ అయిపొయింది తరవాత ఏమి చేయాలి అని అడుగుతుంటారు. నేను ఎప్పుడూ వాళ్ళకి ఒకటే చెపుతుంటాను వాళ్ళకి ఏమి అవ్వాలని ఉందో కనుక్కొన్నారా అని, ఇంకొకటి అడుగుతుంటాను ఇలా ఎంత మందిని అడిగారు అని. ఇలాంటి అనుభవాలు నాకే కాదు మా స్నేహితులకి అవుతుంటాయ్ అని చెపుతుంటారు.ఇలా అడగడం తప్పు అని కాదు గాని, ఎవరో చెప్పింది ఫాలో కావడం లేదా మనం (పేరెంట్స్) అనుకొన్నది వాళ్ళ మీద రుద్దడం కన్నా వాళ్ళ కి ఏమి అవ్వాలని ఉందో కనుక్కోంటే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే పది మందిని సలహాలు అడిగితే పది మంది పది రకాలుగా చెపుతారు...ఏది ఫాలో కావాలో కొంచం కష్టం గా ఉంటాది....ఎందుకంటే అందరూ చెప్పేది మంచిగానే ఉంటాది. ఇదే విషయం మీద నేను ఎక్కడో విన్న చిన్న కథ గుర్తుకోస్తుంది.....

               అనగనగనగనగనగా చాలా కాలం క్రితం ఒక ఊరిలో ఒక వ్యాపారి నివసిస్తూ ఉండేవాడు, ప్రక్కనున్న పట్టణం లో నుండి సరుకులు కొనుక్కొచ్చి కొంచం లాభం వేసుకొని ఆ ఒక ఊరిలో అమ్ముతుండేవాడు. ఆ వ్యాపారికొక గాడిద ఉంది, పట్టణం నుండి సరుకులు తీసుకురావడానికి దాన్ని ఉపయోగిస్తుండేవాడు. వెళ్ళేటప్పుడు గాడిద మీద కూర్చుని వెళ్ళడం, వచ్చేటప్పుడు సరుకులు గాడిద మీద వేసి తను నడిచి రావడం ఆ వ్యాపారి అలవాటు. ఆ వ్యాపారికి ఒక కొడుకు ఉన్నాడు, పెద్దవాడు అవుతున్న కొడుక్కి వ్యాపారంలో కిటుకులు నేర్పాలని ఈసారి పట్టణం వెళ్ళేటప్పుడు కొడుకిని కూడా తీసుకువెళ్దాం అనుకొంటాడు. అనుకొన్నట్టుగానే ఒక మంచి రోజు చూసుకొని పట్టణానికి బయలుదేరతారు.

           వ్యాపారి, వ్యాపారి కొడుకు మరియు గాడిద ప్రయణానికి సిద్ద్ధమయ్యారు. ఇప్పుడు వ్యాపారికో సమస్య వచ్చి పడింది అదేమిటంటే గాడిద మీద ఎవరు కూర్చోవాలో అని ఎందుకంటే పట్టణం చాల దూరం ఆ గాడిద ఒక మనిషి బరువు కంటే మోయలేదు అంత దూరం. ఏంతో ఆలోచించిన ఆ వ్యాపారి చివరకి చిన్నవాడు అయిన తన కొడుకే గాడిద మీద రావడం న్యాయమని తలచి, తన కొడుకిని గాడిద మీద కూర్చుండబెట్టి ప్రయాణం ప్రారంభించాడు. అలా కొంత దూరం ప్రయాణించిన తర్వాత మార్గమధ్యంలో కొంతమంది ప్రయాణికులు గుంపు పట్టణం నుండి గ్రామానికి పోతూ మన వ్యాపారికి ఎదురు వచ్చారు. వారు గాడిద మీద ఉన్న వ్యాపారి కొడుకిని చూసి "సిగ్గు లేదు!! వయస్సు మళ్ళిన తండ్రిని నడిపిస్తూ నువ్వు దర్జాగా గాడిద మీద వెళ్తున్నావా" అని నానారకాలుగా వ్యాపారి కొడుక్కి చివాట్లు పెట్టి తమ దారిన తాము వెళ్ళిపొయారు. బాగా ఆలోచించిన వ్యాపారి కొడుక్కి వాళ్ళు చెప్పింది నిజమే అనిపించింది. వెంటనే వ్యాపారి కొడుకు గాడిద మీదనుండి దిగి తన తండ్రిని గాడిద మీద కూర్చుండబెట్టి తిరిగి ప్రయాణం మొదలుపెట్టాడు.

          అలా అలా ఇంకొంత దూరం ప్రయాణించిన తర్వాత ఇంకొక ప్రయాణికుల గుంపు ఎదురైంది మన వ్యాపారి బృందానికి. వాళ్ళు ఆ వ్యాపారిని తెలుగు సినిమా విలన్ని చూసినట్టు చూసి "దున్నపోతు లాగున్నావు. పెద్దవాడివి అయిన నువ్వు గాడిద మీద వెళ్తూ పాపం చిన్న పిల్లవాడిని నడిపిస్తున్నవా??? సిగ్గు లేదు...!!!!" అని ఆ నలుగురూ నాలుగు రకాలుగా అనేసిసి తమ దారిన తాము వెళ్ళిపొయారు. దిమ్మతిరిగిపొయిన మన వ్యాపారి ఏంచేద్దాం చెప్మా అని ఆలోచించి అలోచించి చివరకి ఎవరూ గాడిదమీద కూర్చొనవద్దు ఇద్దరం నడిచే వెళ్దాం అని నిర్ణయించుకొని తను గాడిద మీద నుండి కిందకి దిగి కొడుకుతోపాటు నడవడం మొదలుపట్టాడు.

            అలా అలా అలా ఇంకొంచం దూరం ప్రయాణించిన తర్వాత మరొక ప్రయాణికుల గుంపు పట్టణం నుండి రావడం వ్యాపారి గమనించాడు. ఇప్పుడు తను, తనకొడుకులలో ఎవరూ గాడిద మీద లేరు కాబట్టి ఆ వచ్చే వాళ్ళు ఏమి అనలేరు అని ధీమాగా నడవడం మొదలుపెట్టాడు మన వ్యాపారి. ఆ ప్రయాణికుల గుంపు, మన వ్యాపారి బృందం ఎదురెదురు పడ్డారు. ఆ గుంపులోని ప్రయాణికులు ఆ వ్యాపారిని, ఆయన కొడుకిని ఒకసారి ఎగాదిగా చూసి వ్యాపారితో  "ఏమయ్యా...చక్కగా ఆరోగ్యంగా ఉన్న గాడిదని దగ్గరగా పెట్టుకుని అలా నడిచి వెళ్ళకపొతే ఎవరొకరు ఆ గాడిద మీద కూర్చుని వెళ్ళవచ్చు కదా???" అంటూ వెళ్ళిపోయారు. వాళ్ళ మాటలు వినగానే వ్యాపారికి, వ్యాపారి కొడుక్కి కూడా పిచ్చి ఎక్కినట్టు అయ్యింది. ఏంచేయలా అని తండ్రి కొడుకులు సమాలోచన చేసుకొని చివరకి వ్యాపారి గాడిద ముందర కాళ్ళని, వ్యాపారి కొడుకు గాడిద వెనక కాళ్ళను పట్టుకొని ఆ గాడిదను మోసుకొంటూ బయల్దేరారు.

               అలా అలా అలా అలా మరికొంచం దూరం ప్రయాణించిన తర్వాత ఇంకొక ప్రయాణికుల గుంపు మన వ్యాపారికి ఎదురైంది. వాళ్ళు గాడిదను మోసుకుపొతున్న వ్యాపారిని, వ్యాపారి కొడుకిని చుసి నవ్వుతా "రెండు గాడిదలు ఒక గాడిదను మోసుకుపొతున్నాయ్" అనుకొంటూ వెళ్ళిపొయారు. వ్యాపారి, వ్యాపారి కొడుకు పిచ్చెక్కినట్టు జుట్టు పీక్కొంటూ కూర్చుండిపొయారు.

                  అసలు ఆ వ్యాపారి ఎవరి మాట వినకుండా తనకు తోచినట్టు చేసుకొంటూ వెళ్ళిపొయుంటే ఇన్ని కష్టాలు ఉండేవి కాదు పాపం.

5 comments:

పేరు:- శ్రీనివాసరావు said...

chala chala baavunnadi

GARAM CHAI said...

బాగా చెప్పారు సార్ ...!!!

చాలా బాగున్నాయ్ పోస్టులు ... !!!!

తెలుగు వారి కోసం నూతనం గా యూ ట్యూబ్ ఛానల్ ప్రారంభించబడింది
చూసి ఆశీర్వదించండి

https://www.youtube.com/garamchai

Unknown said...

good information blog
https://youtu.be/2uZRoa1eziA
plz watch our channel

biograpys said...

nice post ! thanks for sharing the post !
Trendingandhra

Anonymous said...

Good to hear a story